5g smart phone: జియో నుంచి రూ. 2,500కే 5జీ స్మార్ట్‌ఫోన్!
- 30 కోట్ల మంది 2జీ ఫోన్ల వినియోగదారులే లక్ష్యం
- గరిష్ఠంగా రూ. 3 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్లు అందించాలని యోచన
- ప్రస్తుతం రూ. 27 వేలుగా ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్ ధర
టెలికం రంగంలో సంచలనాలకు వేదిక అయిన రిలయన్స్ జియో మరోమారు ఆ రంగాన్ని షేక్ చేసేందుకు సిద్ధమైంది. వచ్చీ రావడమే వినియోగదారులకు 4జీని అందుబాటులోకి తీసుకొచ్చిన జియో.. ఇప్పుడు అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్లను భారతీయులకు పరిచయం చేయాలని యోచిస్తోంది. రూ. 2,500 నుంచి గరిష్ఠంగా రూ. 3 వేలకే ఈ ఫోన్‌ను అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది బేసిక్ 2జీ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీరందరినీ తమవైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యంతో 5జీ చవక స్మార్ట్‌ఫోన్లను అందివ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దేశాన్ని 2జీ రహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఇటీవల ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. అందులో భాగంగానే 5జీ చవక ఫోన్లపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్ల కనీస ధర రూ. 27 వేలుగా ఉంది.