Donald Trump: ఓడిపోతే అమెరికానే వదిలేస్తానేమో..: ట్రంప్ బెదిరింపు వ్యాఖ్యలు!

Sonald Trump Crucial Comments on Leaving America

  • మరో రెండు వారాల్లో అధ్యక్ష ఎన్నికలు
  • బైడెన్ కన్నా వెనుకంజలో ఉన్న ట్రంప్
  • ట్రంప్ తాజా వ్యాఖ్యలపై దేశవ్యాప్త చర్చ

మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ప్రత్యర్థి జో బైడెన్ తో పోలిస్తే, వెనుకంజలో ఉన్నారని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్న వేళ, తనకు ఓటమి తప్పదన్న సంకేతాలు అందుకున్న ట్రంప్, బెదిరింపు వ్యాఖ్యలకు దిగడం చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే, అమెరికాను విడిచి వెళ్లిపోతానని, తాజాగా విస్కాన్సిస్ లో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

అమెరికాలో ఇటీవలి కాలంలో జరిగిన పలు ఘటనలు ట్రంప్ కు వ్యతిరేకంగా మారాయన్న సంగతి తెలిసిందే. వర్ణ వివక్ష, కరోనా కేసులు, మరణాలు, ఆర్థిక పరిస్థితి దిగజారడం, అశాంతి తదితరాలు బైడెన్ కు అనుకూలంగా మారిన వేళ, "నా పరిస్థితి అంత బాగాలేదు. ఈ ఎలక్షన్స్ లో నేను గెలవకుంటే, ఏం చేస్తానో మీరు ఊహించగలరా? అమెరికాను విడిచి పెట్టి వెళ్లిపోతానేమో... నాకు తెలియడం లేదు" అని ట్రంప్ అన్నారు.

తనకు ప్రత్యర్థిగా ఉన్న బైడెన్ గెలిస్తే, కరోనాకు వ్యాక్సిన్ రావడం మరింత ఆలస్యం అవుతుందని, ఇతర దేశాల్లోనే ముందుగా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్న ట్రంప్, ఆయన కావాలనే వైరస్ వ్యాప్తిని విస్తృతం చేస్తారని ఆరోపించారు. బైడెన్ గెలిస్తే, అమెరికా మూసివేత ఖాయమని, యూఎస్ ప్రజల జీవన విధానం నాశనం అవుతుందని, అందుకు బైడెన్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా ఉండాలంటే తనను గెలిపించాలని కోరారు.

కాగా, గత ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి విస్కాన్సిస్ తో పాటు మిచిగన్ రాష్ట్రాలు కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లోనూ ట్రంప్ కు వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో, ఆయన నష్ట నివారణ చర్యలకు దిగి, జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో బైడెన్ కు అనుకూలంగా ఓట్లు పెరిగితే, ట్రంప్ పరాజయం దాదాపు ఖాయమేనని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News