assam: అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ.. సరిహద్దుల వద్ద ఉద్రిక్తత
- అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి
- గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు
- ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి
అసోం, మిజోరం రాష్ట్రాల ప్రజల మధ్య రేకెత్తిన ఘర్షణ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. భద్రతా దళాలు సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అసోంలోని లైలాపూర్, మిజోరం సరిహద్దు గ్రామమైన వైరెంగ్టే మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణ క్రమంగా పెద్దగా మారింది. అసోం ప్రజలపై ఓ గుంపు కర్రలు, ఆయుధాలతో దాడి చేయడంతో గొడవ మొదలైంది.
ప్రతీకారం తీర్చుకునే క్రమంలో లైలాపూర్ వాసులు జాతీయ రహదారి వెంబడి ఉన్న 20 గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పుపెట్టారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు పేర్కొన్నారు. హింస చెలరేగిన ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కార్యాలయంతోపాటు కేంద్ర హోంశాఖకు సమాచారం అందించారు. మిజోరం ముఖ్యమంత్రితోనూ ఫోన్లో మాట్లాడారు.
వైరెంగ్టేకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిహైపుయ్ ‘వి’ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద కాపలా కాసే వలంటీర్ల గుడిసెలు ఉన్నాయి. వీటిని దుండగులు కాల్చివేయడంతోనే ఈ ఘర్షణ చెలరేగినట్టు చెబుతున్నారు. కాగా, ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన పలువురిని ఆసుపత్రులకు తరలించారు.