Sourav Ganguly: ఐసీసీ అధ్యక్ష పదవిని ప్రస్తుతానికి వద్దనుకుంటున్న సౌరవ్ గంగూలీ!
- నిన్నటితో ముగిసిన నామినేషన్ల ఘట్టం
- బీసీసీఐ తరఫున దాఖలు కాని నామినేషన్
- డిసెంబర్ లో ఎన్నిక ఉంటుందన్న ఐసీసీ
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉన్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ప్రస్తుతానికి ఐసీసీ బాధ్యతలను స్వీకరించాలని భావించడం లేదు. ఇటీవల ఐసీసీ అధ్యక్ష పీఠం నుంచి శశాంక్ మనోహర్ తప్పుకున్న తరవాత ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. ఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు 18వ తేదీ ఆఖరు కాగా, నిన్నటితో ఆ గడువు కూడా ముగిసింది. గంగూలీ నామినేషన్ వేయలేదు. బీసీసీఐ నుంచి మరే ఇతర వ్యక్తులు కూడా ఈ పోటీలో లేరని ఐసీసీ వెల్లడించింది.
వచ్చిన నామినేషన్లను స్క్రూటినీ చేసిన అనంతరం, డిసెంబర్ లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, గంగూలీ ఐసీసీ బాధ్యతలు స్వీకరిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ పదవికి గంగూలీ సమర్ధుడని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతానికి ఆ బాధ్యతలు తనకు వద్దని, భవిష్యత్తులో ఐసీసీపై దృష్టిని సారించవచ్చని, తనకు ఆఅవకాశం తప్పకుండా వస్తుందని భావించడం వల్లే గంగూలీ ప్రస్తుతం పోటీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇదిలావుండగా, ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టు పయనం కానున్న నేపథ్యంలో, తొలి టెస్ట్ పింక్ బాల్ తో అడిలైడ్ లో డే అండ్ నైట్ టెస్ట్ గా జరుగుతుందని గంగూలీ ప్రకటించారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడు టీ-20లతో పాటు మూడు వన్డేలు, నాలుగు టెస్టులు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో మ్యాచ్ లు జరిగే తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. డే అండ్ నైట్ టెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తమకు పంపిందని మాత్రం గంగూలీ స్పష్టం చేశారు.