brahmaji: హైదరాబాద్ వరదల కారణంగా ఓ బోటు కొనాలనుకుంటున్నాను: సినీనటుడు బ్రహ్మాజీ సెటైర్
- హైదరాబాద్‌లోని వర్ష బీభత్స పరిస్థితులపై చురకలు
- దయచేసి ఓ మంచి బోటు గురించి తెలపమన్న బ్రహ్మాజీ
- #HyderabadFloods అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్
హైదరాబాద్‌లోని వర్ష బీభత్స పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో అనేక కార్టూన్లు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే బోటు ఉండాల్సిందేనని, కారు, బైకులతో ఇక పనికాదని నెటిజన్లు సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీనటుడు బ్రహ్మాజీ హైదరాబాద్‌లో వర్షాలపై తనదైన శైలిలో స్పందించాడు.
‘ఓ మోటారు బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి తెలపండి’ అని పేర్కొన్నాడు. #HyderabadFloods అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆయన తగిలించాడు. ఆయనకు సలహాలు ఇస్తూ నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు.
హైదరాబాద్ ప్రజలను కుండపోత వర్షాలు నానా ఇబ్బందులకు గురిచేస్తోన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో హైదరాబాద్ మహా నగరం తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే వందలాది కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. అంతేగాక, మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది.
ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రజలను పరామర్శించడానికి ప్రజాప్రతినిధులు బోట్లలో రావాల్సి వస్తోంది. సహాయక సిబ్బంది కూడా బోట్లలోనే వచ్చి నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. పలు కాలనీల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది.