Kishan Reddy: మాటలు కోటలు దాటుతున్నాయ్.. పనులు మాత్రం ప్రగతి భవన్ కూడా దాటడం లేదు: కేసీఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు
- వరదల నుంచి ప్రజలను రక్షించడంలో విఫలమయ్యారు
- కేటీఆర్ రాజకీయ విమర్శలను మానాలి
- కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటిస్తాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను సంరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని... ఇదే సమయంలో పనులు మాత్రం ప్రగతి భవన్ కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ ప్రజలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నారని... అనేక బాధలు అనుభవిస్తున్నారని అన్నారు. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదని... మంత్రి కేటీఆర్ కూడా ఈ సమయంలో రాజకీయ విమర్శలు మాని, వరద బాధితులను ఆదుకోవడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.
తెలంగాణ ధనిక రాష్ట్రమని గతంలో చెప్పుకున్న కేసీఆర్... వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర సాయం ఎందుకు కోరుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన తర్వాత కేంద్రం కచ్చితంగా సాయం చేస్తుందని చెప్పారు. త్వరలోనే కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటిస్తాయని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో వరద నష్టాన్ని కేంద్రం అంచనా వేస్తోందని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.