Brahmos: యుద్ధ నౌకపై నుంచి సూపర్ సానిక్ బ్రహ్మోస్ ప్రయోగం... వీడియో ఇదిగో!
- రెండు స్టేజీల్లో పనిచేసే బ్రహ్మోస్
- లక్ష్యాన్ని తాకిందని డీఆర్డీఓ ప్రకటన
- సైన్యం బలం మరింతగా పెరిగిందని వెల్లడి
స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై మీద నుంచి సూపర్ సానిక్ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగిస్తున్న వీడియోను భారత నౌకాదళం విడుదల చేసింది. అరేబియా సముద్రంలో ఈ పరీక్ష జరుగగా, దూసుకెళ్లిన క్షిపణి, లక్ష్యాన్ని తాకిందని డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) వెల్లడించింది. వంద శాతం కచ్ఛితత్వంతో బ్రహ్మోస్ లక్ష్యాన్ని చేరిందని అధికారులు తెలిపారు. ఈ క్షిపణి ప్రయాణించే సామర్థ్యంలో గరిష్ఠ దూరాన్ని పరీక్షించామని వెల్లడించారు.
సముద్ర ఉపరితలాలపై ఉండే లక్ష్యాలను ఛేదించేందుకు బ్రహ్మోస్ ఇకపై ఎంతో ఉపకరిస్తుందని వ్యాఖ్యానించిన ఉన్నతాధికారులు, ఈ క్షిపణి నేవీ చేతిలో ఉన్న అద్భుతమైన అస్త్రమని అభివర్ణించారు. కాగా, గతనెల 30న బ్రహ్మోస్ సూపర్ సానిక్ మిసైల్ మరో వర్షన్ ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఒడిశా తీరం నుంచి ఈ పరీక్షను జరిపిన అధికారులు, విజయవంతం అయ్యారు.
ఈ మిసైల్ సముద్రాల్లో ఉండే విమాన వాహక నౌకలను అత్యంత సునాయాసంగా ధ్వంసం చేస్తుంది. ధ్వని వేగంతో పోలిస్తే, మూడు రెట్ల వేగంతో ప్రయాణించడం దీని ప్రత్యేకత. ఈ క్షిపణిని వాయు మార్గంలో, సముద్రంలో, భూమిపై నుంచి ఎలాగైనా ప్రయోగించవచ్చు. ఇది రెండు స్టేజీల్లో పనిచేస్తుంది. తొలుత సాలిడ్ ప్రొపెల్లంట్ బోస్టర్ ఇంజన్ క్షిపణిని సూపర్ సోనిక్ వేగానికి తీసుకెళ్లి వదిలేస్తుంది. ఆపై క్షిపణి తన మార్గంలో రెట్టించిన వేగంతో దూసుకెళుతుందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ పేర్కొంది. ఈ మిసైల్ ను ఇండియా, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.