MS Dhoni: నా కుర్రాళ్లలో ఆ కసి కనిపించలేదు: ధోనీ నిర్వేదం
- మరో ఓటమితో ప్లే ఆఫ్ నుంచి దాదాపు నిష్క్రమించిన ధోనీ సేన
- యువ ఆటగాళ్లకు చాన్స్ దక్కలేదని అంగీకరించిన ధోనీ
- ఇకపై మ్యాచ్ లలో స్వేచ్ఛగా ఆడనిస్తానని వెల్లడి
ఐపీఎల్ లో తిరుగులేని జట్లలో ఒకటిగా ముద్రపడిన చెన్నై సూపర్ కింగ్స్, ఈ సీజన్ లో మాత్రం పేలవమైన ఆటతీరుతో విమర్శలను కొనితెచ్చుకుంది. టైటిల్ పోరులో ఉండాలంటే, తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయి, దాదాపుగా ఇంటిదారి పట్టింది. ఈ సీజన్ లో ధోనీ సేన మిగతా అన్ని మ్యాచ్ లూ గెలిచి, ఇతర జట్ల గెలుపు, ఓటములు అనుకూలంగా ఉంటే మాత్రమే చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు నామమాత్రంగా ఉంటాయి. ప్రస్తుతం మూడు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున చెన్నై జట్టు నిలిచింది.
ఇక ఈ మ్యాచ్ తరువాత స్పందించిన ధోనీ, ఆటలో అన్ని రోజులూ మనవే కాబోవని నిర్వేదపు వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్ లో కొన్ని ప్రయోగాలు చేశామని, అవి అందరికీ నచ్చకపోవచ్చని, మైదానంలో పరిస్థితిని బట్టే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. జట్టును ఎక్కువ సార్లు మారుస్తూ వెళితే, ఆటగాళ్లకు తమ స్థానంపై అభద్రతా భావం వస్తుందని, అందువల్లే ఎక్కువ మార్పుచేర్పులు చేయలేదని స్పష్టం చేశారు.
తన జట్టులో కొందరు యువ ఆటగాళ్లకు అవకాశం దక్కని మాట నిజమేనని, అయితే, వారు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటారన్న నమ్మకం, ఆ మెరుపు, కసి వారిలో తనకు కనిపించలేదని ధోనీ వ్యాఖ్యానించారు. వాళ్లపై ఆ నమ్మకం ఉంటే, సీనియర్లను కూడా పక్కన పెట్టేందుకు తాను వెనుకాడబోనని అన్నారు. నిన్నటి మ్యాచ్ తో ఫలితం తేలిపోయింది కాబట్టి, జయాపజయాలను పట్టించుకోకుండా, యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తామని తెలిపారు.
వారిపై ఎటువంటి ఒత్తిడి ఉండబోదు కాబట్టి, ఇకపై వారంతా స్వేచ్ఛగా ఆడతారని ధోనీ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బౌలింగ్ కు సహకరించిన పిచ్, ఆ తరవాత తన స్వభావాన్ని మార్చుకుందని విశ్లేషించిన ధోనీ, తమ ఓటమికి అది కూడా ఓ కారణమని పేర్కొన్నారు.