Uttar Pradesh: సింగర్ పై యూపీ ఎమ్మెల్యే, అతని కుమారుడి అత్యాచారం... కేసు నమోదు!
- నిషాద్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న విజయ్ మిశ్రా
- ఇంట్లో దించి రావాలని కొడుక్కు చెప్పగా, అతనూ అత్యాచారం
- కేసును విచారిస్తున్నామన్న ఎస్పీ రామ్ బదన్ సింగ్
తాను ప్రజా ప్రతినిధినని, గౌరవ ప్రదమైన పదవిలో ఉన్నానన్న విషయాన్ని మరచిపోయి, కుమారుడితో కలిసి, ఓ గాయనిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన యూపీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. నిషాద్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న విజయ్ మిశ్రా, అతని కుమారుడితో కలిసి 25 ఏళ్ల సింగర్ పై దారుణానికి ఒడిగట్టారని భడోహి జిల్లా ఎస్పీ రామ్ బదన్ సింగ్ వెల్లడించారు.
ఓ కార్యక్రమం కోసం తనను 2014లో మిశ్రా ఇంటికి పిలిపించి, అత్యాచారం చేశాడని, విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని తన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఆపై 2015లో వారణాసిలోని ఓ హోటల్ కు పిలిపించి, మరోసారి అదే దారుణానికి పాల్పడ్డారని, ఆ తరువాత తనను ఇంట్లో వదిలేయాలని కొడుకు, మేనల్లుడికి చెప్పగా, వారిద్దరూ కూడా తనపై అత్యాచారం చేశారని తెలిపిందని, కేసును విచారిస్తున్నామని రామ్ బదన్ సింగ్ తెలిపారు.