Pawan Kalyan: సీఎం కేసీఆర్ కు పవన్ కల్యాణ్ విన్నపం
- లాక్ డౌన్, భారీ వర్షాల వల్ల ట్యాక్సీ రంగం నష్టపోయింది
- ఆరు నెలల పన్నును రద్దు చేయండి
- ట్యాక్సీ యజమానులు, డ్రైవర్లను ఆదుకోండి
ట్యాక్సీ యజమానులు, డ్రైవర్లను ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. లాక్ డౌన్ వల్ల, భారీ వర్షాల వల్ల ట్యాక్సీ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల మంది ట్యాక్సీ డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఐటీ, ఇతర పరిశ్రమలు ఎక్కువగా ఉన్న హైదరాబాదులో ట్యాక్సీ రంగం కరోనాతో కుదేలైందని అన్నారు. ఇప్పుడు వరదలు వారి కష్టాలను మరింత పెంచాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో ట్యాక్సీ యజమానులు చెల్లించాల్సిన ఆరు నెలల పన్నును రద్దు చేయాలని కోరారు. సొంతంగా ఒక ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డు తొలగించారని... దీని వల్ల వారు ఇబ్బంది పడుతున్నారని పవన్ అన్నారు. సాధారణ స్థితి వచ్చేంత వరకు ఆన్ లైన్ క్యాబ్ సర్వీసులు కూడా కమిషన్ ను తగ్గించుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారని... ఈ అంశంపై కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.