Reliance: క్వాల్ కామ్ తో కలిసి జియో 5జీ టెస్ట్... 1 జీబీపీఎస్ వేగం!
- ఇప్పటికే నెట్ వర్క్ సిద్ధమైపోయింది
- పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే సాంకేతికత
- 1 జీబీపీఎస్ వేగం రావడం గర్వకారణం
- వెల్లడించిన జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్
ఇండియాలో సాధ్యమైనంత త్వరగా 5జీ సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్న రిలయన్స్ జియో, క్వాల్ కామ్ తో కలిసి ప్రారంభించిన ట్రయల్స్ లో సెకనుకు 1 గిగాబైట్ ఇంటర్నెట్ స్పీడ్ ను అందుకుంది. ఈ విషయాన్ని ఇరు కంపెనీలూ అధికారికంగా ప్రకటించాయి. ఇప్పటికే 5జీ తరంగాలకు అవసరమైన నెట్ వర్క్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సిద్ధమైందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ మ్యాథ్యూ ఓమెన్ వెల్లడించారు. ఇందుకోసం క్వాల్ కామ్ సాంకేతికతను వాడుకుంటున్నామని, 5జీ రేడియో యాక్సెస్ నెట్ వర్క్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేశామని వెల్లడించారు.
"5జీ తరంగాల కోసం క్వాల్ కామ్ టెక్నాలజీని వాడుకుంటున్నాం, వారిస్తున్న మద్దతు వెలకట్టలేనిది. మేము అభివృద్ధి చేసిన 5జీ ర్యాన్, 1 జీబీపీఎస్ వేగాన్ని అందుకుంది.ఈ విషయాన్ని వెల్లడించేందుకు చాలా గర్వంగా ఉంది. ఇంటర్నెట్ వేగాన్ని యూఎస్ సంస్థ నిర్ధారించింది" అని మ్యాథ్యూ వ్యాఖ్యానించారు.
కాగా, ప్రస్తుతం ప్రపంచంలో 5జీ నెట్ వర్క్ ను వినియోగిస్తున్న దేశాల్లో యూఎస్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీలుండగా, త్వరలో ఆ జాబితాలో ఇండియా కూడా చేరనుంది. క్వాల్ కామ్, రిలయన్స్ జియో, తమ అనుబంధ రిడిసిస్ కార్పొరేషన్ ల ఆధ్వర్యంలో 5జీ సొల్యూషన్స్ ను ఇండియాకు దగ్గర చేయనున్నట్టు క్వాల్ కామ్ ఓ ప్రకటనలో మీడియాకు తెలిపింది. ఈ సంవత్సరం ఆరంభంలో రూ. 730 కోట్ల పెట్టుబడిని పెట్టడం ద్వారా క్వాల్ కామ్ వెంచర్స్ సంస్థ జియో ప్లాట్ ఫామ్స్ లో 0.15 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.