Rain: హైదరాబాద్ ను వీడని వరుణుడు.. నేడు కూడా పలు చోట్ల భారీ వర్షం!
- గడచిన 10 రోజులుగా వర్షాలు
- లోతట్టు ప్రాంతాలను వీడని వరద
- ఈ ఉదయం పలు ప్రాంతాల్లో కుండపోత
హైదరాబాద్ మహా నగరంపై వరుణుడు ఇంకా కరుణ చూపలేదు. దాదాపు 10 రోజుల నుంచి నిత్యమూ వర్షం కురుస్తూనే ఉండటంతో, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు ఇప్పటికీ పూర్తిగా బయటకు వెళ్లలేదు. నిత్యమూ ఏదో ఒక సమయంలో కురుస్తున్న వర్షాలకు మరింత నీరు కాలనీల్లోకి వచ్చి చేరుతోంది. ఈ ఉదయం సైతం ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవగా, మలక్ పేట, కోఠి, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఉదయం నుంచి మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతూనే ఉంది. కొన్ని చోట్ల తెరిపినిచ్చినట్టు కనిపిస్తున్నా, ఎప్పుడు వర్షం పడుతుందోనన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రేపటికి తీవ్ర అల్పపీడనంగా మారవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. తీర ప్రాంతంలో మత్స్యకారులు సముద్రంలోకి వేట నిమిత్తం వెళ్లరాదని కోరారు.