Andhra Pradesh: ప్రతి పోలీసు కుటుంబానికి సమాజం జేజేలు.. కులపరమైన దాడులను ఉపేక్షించొద్దు: జగన్
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
- రక్షణ విషయంలో రాజీ పడొద్దన్న సీఎం
- కరోనా కాటుకు బలైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండ: సుచరిత
అమరులైన పోలీసులను దేశమంతా స్మరించుకుంటోందని, ప్రతి పోలీసు కుటుంబానికి సమాజం జేజేలు పలుకుతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలపై కులపరమైన దాడులు జరిగితే ఉపేక్షించవద్దన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లల రక్షణలో ఏమాత్రం రాజీపడొద్దని పోలీసులకు సూచించారు.
రాష్ట్రంలో మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను మహిళలకే అప్పగించినట్టు తెలిపారు. పోలీసు అమరవీరుల వివరాలతో కూడిన పుస్తకాన్ని ఈ సందర్భంగా సీఎం ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. కరోనా విధులు నిర్వర్తిస్తూ మహమ్మారికి బలైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ, సవాళ్లను ఎదుర్కొనే విషయంలో పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు.