Pawan Kalyan: దుబ్బాక ఉపఎన్నికలో పవన్ కల్యాణ్ ప్రచారం?
- బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేస్తారని టాక్
- రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం
- పవన్ ప్రచారంతో యూత్ ను ఆకట్టుకోవచ్చనే యోచనలో బీజేపీ
దుబ్బాక ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఉద్ధృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. మరోవైపు ఓ హాట్ న్యూస్ పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది. ఉపఎన్నిక ప్రచారపర్వంలోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దిగబోతున్నారనేదే ఆ వార్త.
బీజేపీకి జనసేన మిత్రపక్షం అనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా పవన్ ప్రచారం చేస్తారని చెప్పుకుంటున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఆయన ప్రత్యక్షంగా ప్రచారం చేస్తారా? లేక వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తారా? అనే విషయంపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు.
పవన్ ప్రచారం అంశం ఇప్పుడు దుబ్బాకలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ప్రచారం చేస్తే యువత ఓట్లు బీజేపీకి అనుకూలంగా పడతాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ పెద్దలు ఇప్పటికే పవన్ తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. దుబ్బాకలో పవన్ ప్రచారం కలిసొస్తే... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం పవన్ గ్లామర్ ను ఉపయోగించుకునే యోచనలో బీజేపీ ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.