Central Team: వర్షాలు, వరదలతో అతలాకుతలం.... తెలంగాణకు కేంద్ర బృందం రాక
- ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం
- రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటన
- వరద నష్టంపై అంచనా వేస్తారన్న కిషన్ రెడ్డి
తెలంగాణలో ఈ సీజన్ లో అతి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై వరుణుడు పగబట్టాడా అన్నట్టుగా కుండపోత వర్షాలు కురిశాయి. దాంతో నగరంలో వరదలు పోటెత్తాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీగా ప్రాణనష్టం జరిగింది. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వరద పరిస్థితులపై పరిశీలన, అంచనా కోసం తెలంగాణకు కేంద్ర బృందాన్ని పంపుతున్నామని తెలిపారు.
ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం రెండ్రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తుందని వెల్లడించారు. రేపు, ఎల్లుండి జరిగే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర బృందం అనేక ప్రాంతాల్లో పర్యటించి ఆస్తినష్టం, ప్రాణనష్టం వివరాలపై ఓ అంచనాకు వస్తారని వివరించారు. కాగా, వరదల్లో మృతి చెందినవారికి రూ.4 లక్షలు ఇవ్వాలని కేంద్రం గతంలోనే చట్టం చేసిందని, అయితే కేంద్ర సాయం అందేలోపు ఎస్టీఆర్ఎఫ్ నిధుల నుంచి ఖర్చుచేయాలని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ వరద బాధితుల కోసం తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.