Bonus: దసరా బోనస్ ప్రకటించిన కేంద్రం... ఏకమొత్తంగా ఒకేసారి చెల్లింపు
- ఢిల్లీలో నేడు కేబినెట్ సమావేశం
- బోనస్ ఇచ్చేందుకు నిర్ణయం
- 30 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్
- దసరా లోపు ఖాతాలకు బదిలీ చేస్తామన్న జవదేకర్
కేంద్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ద్వారా 30 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు లబ్దిపొందుతారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. పండుగ బోనస్ ను ఏక వాయిదా పద్ధతిలో చెల్లిస్తామని వివరించారు. దసరా లోపు ఆ మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తామని చెప్పారు.
ఈ బోనస్ కారణంగా ఖజానాపై రూ.3,737 కోట్ల భారం పడుతుందని అన్నారు. ప్రొడక్టివిటీ, నాన్-ప్రొడక్టివిటీ రూపంలో బోనస్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.