Ajeya Kallam: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నా పేరు వాడుకుంటున్నారట... ఆ సంగతేంటో చూడండి: డీజీపీకి ఫిర్యాదు చేసిన అజేయ కల్లం
- తనకు వాట్సాప్ లో సందేశాలు వస్తున్నాయన్న అజేయ కల్లం
- లైన్ మన్ జాబ్స్ పేరిట డబ్బు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు
- కఠినచర్యలు తీసుకోవాలన్న కల్లం
ఏపీ సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం తన పేరిట కొందరు మోసాలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చాలని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. పలు వాట్సాప్ గ్రూపుల నుంచి తనకు లెక్కకుమిక్కిలిగా సందేశాలు వస్తున్నాయని, మంగళగిరి ప్రాంతంలో ఓ గ్యాంగు తన పేరు చెప్పుకుంటూ జూనియర్ లైన్ మన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తోందన్నది ఆ సందేశాల సారాంశం అని అజేయ కల్లం తన ఫిర్యాదులో వివరించారు.
ఆ గ్యాంగు తమ కార్యకలాపాలపై నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేందుకు తన పేరు వాడుకుంటున్నట్టు ఆరోపణలు వచ్చిన దరిమిలా, ఇందులో నిజమెంతో తనకు తెలియడంలేదని అజేయ కల్లం పేర్కొన్నారు.
"ఒకవేళ ఈ ఆరోపణలే నిజమని తేలితే నిరుద్యోగులను మోసం చేస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నాకు వచ్చిన సందేశాలు తప్పని తేలితే, ఆ ఫేక్ మెసేజ్ లు ఎవరు పంపారో, ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభిస్తారని కోరుతున్నాను" అంటూ అజేయ కల్లం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.