Crocodile: కేరళలో ఆలయంలో మొసలి... శాకాహారమే తింటుందంటున్న స్థానికులు!
- కాసర్ గాడ్ జిల్లాలో అనంతపుర దేవాలయం
- పూజారి చెప్పడంతోనే తిరిగి కొలనులోకి
- ఎన్నో ఏళ్లుగా తెలుసంటున్న స్థానికులు
అది కేరళలోని కాసర్ గాడ్ లో ఉన్న శ్రీ అనంతపుర దేవాలయం. ఆ దేవాలయంలోకి అనుకోని అతిథి వచ్చింది. అదే ఓ భారీ మొసలి. అది ఎన్నో సంవత్సరాలుగా ఆలయ కొలనులోనే ఉంటోందట. దాన్ని భక్తులు బబియా అని పిలుచుకుంటుంటారు. అయితే ఎప్పుడూ ఆలయంలోకి వచ్చే ప్రయత్నం చేయని బబిత, తొలిసారిగా ఆలయంలోకి ప్రవేశించి, గర్భగుడి వరకూ రావడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరిచింది.
ఆలయ కోనేరులో ఈ మొసలి గత 70 సంవత్సరాలుగా ఉంటోందని, శాకాహారం మాత్రమే తిని బతుకుతుందని స్థానికులు వెల్లడించారు. "బబియా గర్భగుడిలోకి వెళ్లిందని కొన్ని వార్తలు వచ్చాయి. అది అవాస్తవం. గుడిలోకి మాత్రం వచ్చి కాసేపు గడిపింది. నీటిలోకి వెళ్లాలని ముఖ్య పూజారి చంద్రప్రకాశ్ నంబీశన్ కోరగా, ఆ వెంటనే అది తిరిగి నీటిలోకి వెళ్లిపోయింది" అని దేవాలయ అధికారి చంద్రశేఖరన్ వెల్లడించారు.
ఆలయ కొలనులోకి మొసలి ఎప్పుడు, ఎలా ప్రవేశించిందో తెలియదని, దానికి బబియా అని ఎవరు పేరు పెట్టారో కూడా తెలియదని, అయితే, ఇన్నేళ్లలో ఆ మొసలి ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించలేదని స్థానికులు వెల్లడించారు. ఆలయ పూజారి పిలవగానే కొలను నుంచి బయటకు వచ్చి, ప్రసాదం తిని వెళుతుందని అన్నారు. సర్కస్ బృందాలు విరివిగా ఉన్న ఉత్తర కేరళలో ఏదో కంపెనీలో పెరిగిన మొసలిని ఈ కొలనులో వేసి వుండవచ్చని మరికొందరు అంటున్నారు.