Raghu Rama Krishna Raju: ఆ సర్వే రాళ్లపై మీ బొమ్మలు ఎందుకు?: సీఎం జగన్ పై రఘురామ విసుర్లు

MP Raghurama Krishnamraju asks why CM Jagan image on survey stones

  • కొనసాగుతున్న రఘురామకృష్ణరాజు రచ్చబండ
  • సర్వే రాళ్లుగా ఖరీదైన గ్రానైట్ రాళ్లు ఎందుకన్న రఘురామ
  • మిమ్మల్ని అప్రదిష్ఠ పాల్జేస్తున్నారంటూ వ్యాఖ్యలు 

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అంశాల వారీగా విమర్శలు గుప్పిస్తూ నిర్వహించే రచ్చబండ మీడియా కార్యక్రమం ఇవాళ కూడా షురూ అయింది. శిలలపై జగనన్న చిత్రాలు అనే టాపిక్ పైనా ఆయన మాట్లాడారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు ఏంటని ప్రశ్నించారు. అది కూడా ఖరీదైన గ్రానైట్ రాళ్లు తెప్పించి వాటిపై జగనన్న చిత్రాలు చెక్కిస్తున్నారని విమర్శించారు. సర్వే రాళ్లు వేసుకోవడంలో తప్పులేదని, అందుకోసం మామూలు సర్వే రాళ్లు తెచ్చుకోవచ్చని అన్నారు.

"ఇంతపెద్ద రాష్ట్రంలో రీసర్వే చేసి, ఈ విధంగా రాళ్లు పాతుకుంటూ పోవాలంటే ఎన్ని లక్షల రాళ్లు కావాలి? ఆ రాళ్ల కొనుగోలులో ఏంచేస్తారో తెలియదు! అసలు ఆ రాళ్లపై మీ బొమ్మ ఎందుకు? అసలు ఈ పిచ్చ ఏంటి? మీకు అంత పిచ్చ ఉందని నాకైతే అనిపించడంలేదు కానీ మొత్తానికి ఇదొక హాస్యాస్పదమైన నిర్ణయం. మీరు పాతికేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆ 26వ సంవత్సరంలో వచ్చే మరో ముఖ్యమంత్రి కచ్చితంగా ఆ సర్వే రాళ్లు పగులగొడతారు.

ఎందుకింత ఖర్చు... అసలు మీ బొమ్మ ఎందుకని అడుగుతున్నాను. ఆ సర్వేకి మీ బొమ్మకు ఏమైనా సంబంధం ఉందా? ఎప్పుడో 1310 నుంచి 1350 మధ్యన కర్ణాటకలో జక్కన్న అనే మహాశిల్పి ఉండేవాడు. గొప్ప శిల్పాలు చెక్కిన ఆ జక్కన్న గురించి మాట్లాడుకుంటారే తప్ప, ఇవాళ బొమ్మలు చెక్కించుకుంటున్న జగనన్నను ఎవరూ గుర్తుపెట్టుకోరు.

ఏదైనా మంచి కార్యక్రమం చేసి పునాదిరాయి వేసి మీ బొమ్మ పెట్టుకోండి, లేదా మంచి కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసి మీ బొమ్మ పెట్టుకోండి. అంతేగానీ, మరీ సర్వే రాళ్లకు కూడా మీ బొమ్మలా? వాటికి మళ్లీ శాంపిల్స్ కూడానా... ఓ రాయిపై మీ బొమ్మ వేసి మీ అనుమతి కోసం మీకు చూపించడమా? అలా మీవద్దకు సర్వే రాళ్లను తీసుకొచ్చేవారిని ఫాట్ మని కొట్టండి. కేవలం మిమ్మల్ని అప్రదిష్ఠ పాల్జేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు. మీదొక విపరీత స్వభావం అని ప్రచారం చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు" అంటూ రఘురామకృష్ణరాజు వివరించారు.

  • Loading...

More Telugu News