Botsa Satyanarayana: రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఏం చేశారట?: బొత్స
- అమరావతి అంశంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్
- ఐదేళ్లలో బాబు ఐదు శాతం పనులు కూడా చేయలేదన్న బొత్స
- హైదరాబాదులో తన ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారని విమర్శలు
అమరావతి శంకుస్థాపన అంశం నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఏంచేశారని ప్రశ్నించారు. కనీసం కృష్ణానది కరకట్ట రోడ్డు కూడా వేయలేదని అన్నారు. ఐదేళ్లలో ఐదు శాతం పనులు కూడా చేయలేదని విమర్శించారు. చంద్రబాబు బాధంతా బినామీల కోసమేనని ఆరోపించారు. సచివాలయ భవనాల కోసం చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేసి తాత్కాలికం అన్నారని వెల్లడించారు.
"ఐదేళ్లలో చంద్రబాబు సచివాలయం కట్టాడా? పేదలకు ఒక్క ఇల్లయినా ఇచ్చాడా? హైదరాబాదులో తన ఇంటి నిర్మాణం మాత్రం పూర్తి చేసుకున్నారు. రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ఎంత దోచుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాజధాని కోసం చేసిన అప్పులు, ఎంత తిన్నదీ అంతా తెలుసు. రూ.1.50 లక్షల కోట్ల మేర అంచనాలు రూపొందించి, రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు" అని వెల్లడించారు. వైసీపీకి ఇదే చివరి అవకాశం అని దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సీఎం జగన్ ను ప్రజలు ఎలా వదులుకుంటారు? అని ప్రశ్నించారు.