Joe Biden: చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్... ట్రంప్ కు సహకరించే దేశాలకు బైడెన్ సీరియస్ వార్నింగ్!
- చివరి డిబేట్ లో వాద ప్రతివాదాలు
- రష్యాలో ట్రంప్ కు వ్యాపారాలు, చైనాలో రహస్య ఖాతాలు
- తీవ్ర ఆరోపణలు చేసిన జో బైడెన్
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరొక్క పది రోజుల వ్యవధే ఉంది. ప్రత్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లు ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు. తాజాగా, వీరిద్దరి మధ్యా చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. ఈ ముఖాముఖిలో జో బైడెన్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎన్నికల్లో గెలవబోయేది తానేనని, ట్రంప్ గెలవాలని భావిస్తూ, ఆయనకు సహకరించే దేశాలు సమీప భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు.
"నేను ఒకటే విషయాన్ని నేడు చాలా స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను. యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో కలుగజేసుకునే ఏ దేశమైనా మూల్యం చెల్లించాల్సిందే. రష్యా, చైనాతో పాటు ఎన్నో దేశాల్లో ట్రంప్ కు వ్యాపారాలు ఉన్నాయి. రష్యా నుంచి భారీగా డబ్బులు వస్తున్నాయి. చైనాలో ట్రంప్ కు సీక్రెట్ ఎకౌంట్స్ ఉన్నాయి. నేను ఒక్క దేశం నుంచి కూడా ఒక్క పైసా తీసుకోలేదు. ట్రంప్ కు సహకరించే దేశాలు ఇబ్బందులు పడతాయి" అని బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇదే డిబేట్ లో పాల్గొన్న ట్రంప్, దీటుగా బదులిస్తూ, "బైడెన్ కు రష్యా నుంచి మిలియన్ల డాలర్ల కొద్దీ సాయం అందుతోంది. కరోనాకు కారణం చైనా దేశమే. యూఎస్ కరోనాను నియంత్రించింది. మరణాల రేటు చాలా తగ్గిపోయింది. కరోనాకు వ్యాక్సిన్ ను తీసుకుని వచ్చేందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిల్లో అమెరికా ముందుంది. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేసులు అధికంగా ఉన్నాయి. త్వరలోనే వ్యాక్సిన్ ను తీసుకుని వస్తాం. సైన్యం సాయంతో వ్యాక్సిన్ ను ప్రజలకు అందిస్తాం" అని అన్నారు.