Corona Virus: 10 కి.మీ సైకిలు తొక్కుతూ.. పేదల ఇంటికి వెళ్లి కరోనా చికిత్స చేస్తోన్న వైద్యుడు
- మహారాష్ట్రలో హోమియోపతి వైద్యుడి సేవలు
- 87 ఏళ్ల వయసులోనూ పేదలకు రామ్‌చంద్ర దండేకర్ వైద్యం
- గత 60 ఏళ్లుగా తన సైకిలు పైనే రోగుల ఇంటికి
చేతిలో డబ్బు పెడితేగానీ వైద్యం చేయని రోజులివి. ఆసుపత్రికి వచ్చిన వారి వద్ద నుంచి వీలైనంత ఎక్కువ డబ్బు లాగాలని కొందరు వైద్యులు ప్రయత్నిస్తుంటారు. కరోనా వైరస్ విజృంభణ సమయంలో రోజుకు వేల రూపాయల్లో రోగుల నుంచి లాగుతున్నారు. ఇక కరోనా బారిన పడే పేదల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.
ఆసుపత్రిలో చేరలేక, ఇంటికి వైద్యుడిని పిలిపించుకుని వైద్యం చేయించుకునే స్తోమత లేక పేదలు నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితులలో మహారాష్ట్రలోని ఓ హోమియోపతి వైద్యుడు మాత్రం కరోనా బారినపడ్డ పేదలకు వైద్యం చేయడానికి తన సైకిలుపై రోజుకి 10 కిలోమీటర్లు వెళుతున్నాడు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రామ్‌చంద్ర దండేకర్ వయసు 87. ఈ వయసులోనూ ఆయన రోగుల నుంచి డబ్బులు ఆశించకపోవడమే కాకుండా, పేదల ఇంటికే వెళ్లి వైద్యం చేస్తున్నారు. కరోనా సమయంలోనే కాదు.. ఆయన గత 60 ఏళ్లుగా తన సైకిలు పైనే రోగుల ఇంటికి వెళ్లి వైద్యం చేస్తున్నారు.