Narendra Modi: ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ప్రతిపక్ష నేతలు అంటున్నారు: ప్రధాని ఎద్దేవా

modi on article 370

  • అధికారంలోకి వస్తే ఆ పని చేస్తారట
  • అలా చేస్తే బీహారీలను అవమానించినట్లు కాదా?
  • దేశ సరిహద్దుల్లో బీహారీలు పోరాడుతున్నారు
  • పుల్వామా దాడిలో బీహారీ జవాన్లు మరణించారు

బీహార్‌‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 28 నుంచి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్డీయే కూటమి తరఫున ససారమ్‌లో ఈ రోజు ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

కరోనా సమయంలో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం శరవేగంగా స్పందించి ప్రజలకు అండగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. ఆ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించి వున్నా చాలా ముప్పు ఎదురయ్యేదని అన్నారు. నేడు బీహార్‌ ప్రజలు కరోనా‌పై పోరాడి, ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు.

2014 తర్వాత బీహార్‌లో అభివృద్ధి డబుల్‌ రైల్‌ ఇంజన్‌లా పరిగెడుతోందని మోదీ అన్నారు. అలాగే, గాల్వన్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిందని, అయితే ప్రతిపక్ష పార్టీలు తాము అధికారంలోకి వస్తే దాన్ని పునరుద్ధరిస్తామని చెబుతున్నాయని, ఇలా చేయడం ద్వారా వారు బీహారీలను అవమానించినట్టు కాదా? అని మోదీ ప్రశ్నించారు.

భారత భూభాగ రక్షణ కోసం బీహారీలు తమ పిల్లలను సరిహద్దుల్లోకి పంపుతున్నారని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడిలోనూ పలువురు బిహారీ జవాన్లు అమరులయ్యారని ఆయన అన్నారు. కాగా, ఎన్నికలకు ముందే బీహార్ ప్రజలు తమ సందేశాన్ని ఇచ్చారని, అన్ని సర్వేలు బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తేల్చాయని ప్రధాని చెప్పారు.

బీహార్ ను అభివృద్ధి పథంలో నడిపిన పాలకులను మరోసారి గెలిపించుకునేందుకు బీహార్ ప్రజలు ఎదురుచూస్తున్నారని, గతంలో రాష్ట్రాన్ని పాలించిన వారు అభివృద్ధిలో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని బీహార్ ప్రజలు మరిచిపోవద్దని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో బీహార్‌లో అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించామని చెప్పారు. అలాగే, తాము జాతీయ రహదారులను విస్తరించామని ప్రధాని తెలిపారు.

  • Loading...

More Telugu News