Shankar: 'ఇండియన్ 2' విషయంలో విసిగిపోయిన శంకర్.. నిర్మాతకు ఘాటుగా లేఖ!

Shankar writes letter to producer of Indian sequel
  • ఇన్నేళ్ల తర్వాత 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ 
  • ఆమధ్య సెట్లో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి
  • లాక్ డౌన్ తో 6 నెలల నుంచి షూటింగుకి బ్రేక్
  • బడ్జెట్ తగ్గించమంటున్న నిర్మాత
  • ససేమిరా అంటున్న దర్శకుడు శంకర్    
1996లో కమలహాసన్ కథానాయకుడుగా వచ్చిన 'భారతీయుడు' (తమిళంలో ఇండియన్) సినిమా ఒక పెద్ద సంచలనం. అవినీతిపరులపై విసిగివేసారిపోయిన ఓ స్వాతంత్య్ర సమరవీరుడు తనదైన శైలిలో చేసిన పోరాటంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుని భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో దర్శకుడు శంకర్ ఇమేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి విదితమే. కమల్, కాజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు చాలావరకు జరిగింది. అదే సమయంలో షూటింగ్ సెట్లో యాక్సిడెంట్ జరిగి ముగ్గురు యూనిట్ సభ్యులు మరణించడంతో కొన్నాళ్లు షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత లాక్ డౌన్ రావడంతో ఆరు నెలల నుంచీ షూటింగ్ లేదు.

ఈ క్రమంలో చిత్ర నిర్మాణ వ్యయం ఇప్పటికే బాగా పెరిగిపోవడంతో చిత్రం బడ్జెట్టును బాగా తగ్గించమని దర్శకుడిపై చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒత్తిడి తెస్తోంది. అయితే, దర్శకుడు మాత్రం క్వాలిటీ విషయంలో రాజీపడే మనిషి కాదు. దాంతో ససేమిరా అన్నాడని, దీంతో సదరు చిత్ర నిర్మాణ సంస్థ తదుపరి షూటింగును ఇంకా ప్రారంభించడం లేదనీ తెలుస్తోంది.

శంకర్ ఎన్ని సార్లు అడిగినప్పటికీ, నిర్మాత నుంచి సరైన జవాబు లేదట. దాంతో విసిగిపోయిన దర్శకుడు తాజాగా నిర్మాతకు ఘాటుగా లెటర్ రాశాడని అంటున్నారు. షూటింగ్ విషయమై వెంటనే ఏదో ఒకటి తేల్చాలని, ఒకవేళ ఆలస్యమయ్యేలా వుంటే కనుక తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించుకుంటాననీ ఆ లేఖలో దర్శకుడు శంకర్ తేల్చిచెప్పాడట. అయితే, దీనికి ఇంతవరకు నిర్మాత నుంచి రిప్లై లేదనీ, జవాబు కోసం శంకర్ ఎదురుచూస్తున్నాడనీ అంటున్నారు.
Shankar
Kamal Hassan
Indian 2
Kajal Agarwal

More Telugu News