Buggana Rajendranath: కేంద్రం పోలవరం నిర్మాణం చేపడితే కాంట్రాక్టులు దక్కవనే టీడీపీ సర్కారు నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుంది: బుగ్గన
- ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో బుగ్గన భేటీ
- పోలవరం నిధులు విడుదల చేయాలని కోరినట్టు వెల్లడి
- షరతుల్లేకుండా విడుదల చేయాలని కోరామన్న బుగ్గన
ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఆయన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బును షరతులు లేకుండా విడుదల చేయాలని కోరినట్టు వివరించారు. పోలవరాన్ని పూర్తిగా తామే నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం చెప్పిందని, పునరావాసం, భూసేకరణ ఖర్చు కేంద్రానిదే అని చట్టంలో ఉంది అని బుగ్గన స్పష్టం చేశారు.
అయితే, కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టును 2014లో రాష్ట్రం చేపట్టిందని వెల్లడించారు. కేంద్రం పోలవరం నిర్మాణం చేపడితే కాంట్రాక్టులు దక్కవనే ఉద్దేశంతో అప్పటి టీడీపీ సర్కారు నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. 2014 నాటి ఖర్చు ఇవ్వాలని గత ప్రభుత్వం తీర్మానం చేసిందని, పోలవరం ఖర్చును పరిమితం చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని మంత్రి బుగ్గన వివరించారు. పోలవరం విషయంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని అన్నారు.