North Korea: చైనా మంగోలియాల నుంచి 'కరోనా' గాలులు... తన ప్రజలకు కిమ్ జాంగ్ ఉన్ కఠిన హెచ్చరికలు!
- ఎడారుల మీదుగా వీస్తున్న గాలులు
- ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఉత్తర్వులు
- విషయాన్ని వెల్లడించిన రష్యన్ దౌత్య కార్యాలయం
చైనా, మంగోలియా, ఎడారుల మీదుగా వీస్తున్న పవనాలతో పాటు వస్తున్న ఇసుక, దుమ్ము కణాలతో కరోనా మహమ్మారి తన దేశంలోనికి వస్తోందన్న ఆలోచనలో ఉన్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ కార్యకలాపాలనూ నిషేధిస్తున్నట్టు సంచలన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు ఎవరూ ఇల్లు దాటి బయటకు రారాదని పేర్కొన్నారు. దుష్ట, హానికర గాలులు వస్తున్నాయని, వీటి కారణంగా వైరస్ ప్రమాదం పొంచివుందని అధికార వార్తా పత్రిక ప్రత్యేక కథనాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంతో ఎవరూ ఇల్లు కదల్లేని పరిస్థితి నెలకొంది.
ఇదే సమయంలో ఎడారుల మీదుగా వస్తున్న ఎల్లో డస్ట్ గురించి ఉత్తర కొరియాలోని అన్ని రాయబార కార్యాలయాలకూ అధికారులు సమాచారం ఇవ్వడంతో పాంగ్ యాంగ్ లోని రష్యన్ దౌత్య కార్యాలయం విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొంది. ఇసుక తుపానులు ముంచుకుని వస్తున్నందున ప్రజలు తలుపులు, కిటికీలు బిగించుకుని ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇక ఉత్తర కొరియాలో ప్రభుత్వం వెలువరించిన ఆదేశాలను దక్షిణ కొరియా కొట్టి పారేసింది. ఉత్తర కొరియా చెబుతున్నట్టుగా ధూళి కణాల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలు లేవని ప్రకటించింది. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా ఇదే విషయాన్ని పేర్కొందని, గాలిలో కరోనా వైరస్ కొన్ని గంటల పాటు మాత్రమే జీవించి వుంటుందని సౌత్ కొరియా అధికారులు వెల్లడించారు.
కాగా, ఉత్తర కొరియాతో పాటు తుర్కెమిస్తాన్ కూడా తమ దేశ ప్రజలకు ఇదే విధమైన ఆదేశాలను వెలువరించిందని బీబీసీ డిస్ఇన్ఫర్మేషన్ టీమ్ పేర్కొంది. ప్రతి సంవత్సరమూ కొన్ని నిర్దిష్ట రోజుల్లో చైనా ఎడారుల మీదుగా కొరియన్ భూములవైపు వచ్చే గాలుల ద్వారా ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ విషయమై ప్రజలు ఆందోళనలో ఉన్న సమయంలోనే ప్రభుత్వం ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.