GITAM: సగంలో చదువు ఆపేసిన జగన్ కు విద్యాసంస్థల గొప్పదనం ఏం తెలుస్తుంది?: టీడీపీ నేత పట్టాభి
- చీకటి వ్యాపారాలు చేయడం జగన్ కు అలవాటైపోయింది
- గీతం యూనివర్శిటీలో 23 వేల మంది చదువుకుంటున్నారు
- విద్య అన్నా, విద్యా సంస్థలు అన్నా జగన్ కు గౌరవం లేదు
విశాఖలోని గీతం యూనివర్శిటీకి సంబంధించిన కొన్ని కట్టడాలను అధికారులు కూల్చివేసిన ఘటనను టీడీపీ నేత పట్టాభి తీవ్రంగా ఖండించారు. దొంగల ముఠా నాయకుడికి తప్పుడు జీవోలు, తప్పుడు ఆర్డినెన్స్ లు ఇవ్వడం నిత్యకృత్యంగా మారిపోయిందని జగన్ పై విమర్శలు గుప్పించారు. అర్ధరాత్రి దొంగ జీవోలు ఇవ్వడం, చీకటి వ్యాపారాలు చేయడం, చీకట్లో పని చేయడం అలవాటైపోయిందని అన్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీల్లో గీతం ఒకటని... ఇందులో 23 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఒక్క విశాఖ క్యాంపస్ లోనే 13 వేల మంది ఉన్నారని, వీరిలో 400 మంది విదేశీ విద్యార్థులని చెప్పారు.
నాలుగు దశాబ్దాలుగా విద్యను అందిస్తున్న సంస్థను రాజకీయ దురుద్దేశాలతో టార్గెట్ చేయడం దారుణమని పట్టాభి అన్నారు. వైసీపీకి చెందిన ఎందరో నేతల పిల్లలు కూడా ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారని చెప్పారు. చదువును సగంలోనే ఆపేసిన జగన్ కు విద్యాసంస్థల గొప్పతనం ఏం తెలుస్తుందని మండిపడ్డారు. విద్య అన్నా, విద్యాసంస్థలు అన్నా ఆయనకు గౌరవం లేదని చెప్పారు.