Perni Nani: మహేశ్ బాబు సినిమాకు చప్పట్లు కొడతారు... అదే పని జగన్ చేస్తే విమర్శిస్తారా?: పేర్ని నాని
- వాహనదారులపై భారీ జరిమానాలు విధిస్తున్న ఏపీ ప్రభుత్వం
- ప్రజల సంక్షేమం కోసమేనన్న పేర్ని నాని
- ఇష్టమొచ్చినట్టు వాహనాలను నడిపే వారిపై చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్న
ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించేవారిపై ఏపీ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. భారీ ఫైన్లతో ఉల్లంఘనులను బెంబేలెత్తిస్తోంది. భారీ ఫైన్లకు సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే... కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. మోటార్ వెహికల్ యాక్ట్ లో కేంద్ర ప్రభుత్వం 31 సవరణలు చేసిందని, వీటిలో 20 సెక్షన్లను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని చెప్పారు. మిగిలిన 11 సెక్షన్లలో మాత్రమే రాష్ట్రాలకు వెసులుబాటును కల్పించిందని తెలిపారు.
కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి జగన్ భారీ జరిమానాల నిర్ణయం తీసుకున్నారని పేర్ని నాని చెప్పారు. ఇష్టమొచ్చినట్టు వాహనాలను నడిపే వారిపై చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు. రోడ్లపై గోతులను ముందు పూడ్చండి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై ఆయన స్పందిస్తూ... భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు.
రోడ్లపై గుంతలు పడితే ఇష్టమొచ్చినట్టు వాహనాలు నడపొచ్చా? అని అడిగారు. మహేశ్ బాబు చిత్రం 'భరత్ అనే నేను' సినిమాలో భారీ జరిమానాలు విధిస్తే అందరూ చప్పట్లు కొట్టారని... అదే పని జగన్ చేస్తే విమర్శిస్తారా? అని మండిపడ్డారు. ప్రజల మీద ద్వేషంతో ఫైన్లు వేయడం లేదని... వాళ్లు తప్పు చేయకుండా ఉండటానికే ఈ పని చేస్తున్నామని చెప్పారు.