Pakistan: బోర్డర్ లో పాకిస్థాన్ డ్రోన్ ను కూల్చేసిన భారత సైన్యం
- కుప్వారా జిల్లాలో ఈ ఉదయం కూల్చివేత
- చైనా తయారీ డ్రోన్ ను పంపించిన పాకిస్థాన్
- ఉగ్రవాదులను పంపేందుకు పాక్ యత్నిస్తోందన్న ఆర్మీ అధికారులు
ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా తన సహాయ సహకారాలను పాకిస్థాన్ అందిస్తోంది. ఆయుధాలను సైతం డ్రోన్లతో అందిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మన ఆర్మీ కదలికలను సైతం డ్రోన్ల సహకారంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పాక్ కు చెందిన పలు డ్రోన్లను మన సైనికులు కూల్చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. నియంత్రణ రేఖ వద్ద ఏదో కదులుతున్నట్టు మన సైనికులు గమనించారు. దాన్ని పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ గా గుర్తించారు. వెంటనే దాన్ని కూల్చేశారు.
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఈ ఉదయం 8 గంటల సమయంలో ఈ డ్రోన్ ను కూల్చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు మాట్లాడుతూ, పాక్ చర్యలను అడ్డుకోవడానికి సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. చలికాలంలో ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుందని... అందుకే ఈలోగానే ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ డ్రోన్ ను చైనా కంపెనీ డీజేఐ తయారుచేసిందనీ, దాని పేరు మావిక్-2 ప్రో అని చెప్పారు.