Sunrisers Hyderabad: చేజేతులా ఓడిపోయిన సన్ రైజర్స్... 3.5 ఓవర్లలోనే 7 వికెట్ల పతనం... ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం!
- తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకు పరిమితమైన కేఎక్స్ ఐపీ
- అసాధ్యం కాని లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ వైఫల్యం
- ఇతర టీమ్ ల జయాపజయాలే ఇప్పుడు కీలకం
టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదు... కేవలం 127 పరుగులు... మంచి ఆరంభమే లభించింది. 100 పరుగులు సాధించే వరకు 3 వికెట్లు మాత్రమే పోయాయి. మరో 24 బంతుల్లో 27 పరుగులు చేస్తే విజయం ఖాయం. అటువంటి పటిష్ఠమైన స్థితి నుంచి, గెలిచేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ కోల్పోతూ, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిని చేజేతులా కొనితెచ్చుకుని ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
నిన్న రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చివరి 7 వికెట్లనూ 3.5 పరుగుల తేడాతో కోల్పోయి, 14 పరుగులు మాత్రమే చేసి, 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో టాప్-4లో సన్ రైజర్స్ నిలవాలంటే, ఇతర టీమ్ ల జయాపజయాలు కీలకం అయ్యాయి.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 126 పరుగులే చేసింది. హైదరాబాద్ బౌలర్లు పంజాబ్ ను కట్టడి చేయడంలో విజయవంతమయ్యారు. పూరన్ చేసిన 32 పరుగులు మినహా మిగతా ఎవరూ చెప్పుకునే రీతిలో రాణించలేకపోయారు. రషీద్, హోల్డర్, సందీప్ లు తలా 2 వికెట్లు తీశారు.
ఆపై 127 పరుగుల లక్ష్యంతో దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో శుభారంభాన్ని అందించారు. 35 పరుగులు చేసిన వార్నర్, 19 పరుగులు చేసిన బెయిర్ స్టో అవుట్ అయిన తరువాత పాండే 15, సమద్ 7, శంకర్ 26 పరుగులకు అవుట్ అయిన తరువాత సన్ రైజర్స్ కు కష్టాలు మొదలయ్యాయి.
ఆపై ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేక పోవడంతో టార్గెట్ పక్కనే కనిపిస్తున్నా, టీమ్ మాత్రం దాన్ని చేరుకోలేకపోయింది. 17వ ఓవర్ వేసిన జోర్డాన్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేలా తొలి బంతికే పాండేను పెవీలియన్ పంపాడు. ఆ తరువాతి ఓవర్లో శంకర్ అవుట్ కాగా, 19వ ఓవర్ లో రెండు, 20వ ఓవర్ లో మూడు వికెట్లను కోల్పోయిన సన్ రైజర్స్ ఓటమిని ఖరారు చేసుకుంది.