Maratorium: మారటోరియంలో చెల్లించని ఈఎంఐలపై చక్రవడ్డీ మాఫీ!
- మార్చి నుంచి ఆగస్టు వరకూ మారటోరియం
- రూ. 2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీ వద్దు
- చెల్లించిన వారికి రీయింబర్స్ మెంట్
- సుప్రీంకోర్టుకు వెల్లడించిన కేంద్రం
మార్చి నుంచి ఆగస్టు వరకూ వివిధ రకాల రుణాల ఈఎంఐలను మారటోరియంలో భాగంగా చెల్లించని రుణ గ్రహీతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. రూ. 2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఇది విద్య, వాహన, వ్యక్తిగత, గృహ రుణాలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలు, ఎంఎస్ఎంఈలకు వర్తిస్తుందని తెలిపింది. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు మార్చి మూడో వారంలో లాక్ డౌన్ మొదలైన వేళ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నెలల మారటోరియంను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆపై కరోనా మహమ్మారి వ్యాప్తి మరింతగా పెరిగి, దేశవ్యాప్తంగా ఆర్థిక రంగం కుదేలై, అన్ని రకాల పరిశ్రమలు దెబ్బతిని జీడీపీ తగ్గిపోగా, మరో మూడు నెలల పాటు మారటోరియంను పొడిగిస్తూ, ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి కూడా విదితమే. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారిలో అత్యధికులు మారటోరియంను వినియోగించుకోగా, పలువురు ఈఎంఐలను చెల్లించారు కూడా. యథాప్రకారం వాయిదాలు చెల్లించిన వారికి కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసిన కేంద్రం, సదరు చక్రవడ్డీని కేంద్రమే భరిస్తుందని, దీని కారణంగా రూ.6,500 కోట్ల భారం ఖజానాపై పడుతుందని వెల్లడించింది.
ఇదిలావుండగా, ఈ నెల 14వ తేదీన చక్రవడ్డీ మాఫీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, సామాన్యుడు దీపావళి పండగను చేసుకోవడం కేంద్రం చేతుల్లోనే ఉందని, వడ్డీపై వడ్డీని వేయాలన్న యోచన తగదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, మారటోరియం సమయంలో ఈఎంఐలు చెల్లించిన వారు, ఆయా వివరాలతో కేంద్రం నుంచి రీయింబర్స్ మెంట్ ను పొంది ఉపశమనం పొందవచ్చని కూడా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.