Anitha: పండుగ రోజు పస్తులుండే పరిస్థితిని తీసుకొచ్చారు: అనిత
- నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి
- టీడీపీ హయాంలో పండుగలకు ఉచిత కానుకలు అందించాము
- ఇప్పుడు పప్పు, బెల్లాలపై కూడా పన్నులు వేస్తున్నారు
పండుగనాడు జనాలు పస్తులుండే పరిస్థితిని తీసుకొచ్చారంటూ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజలకు ఉచితంగా పండుగ కానుకలను అందించామని... వైసీపీ పాలనలో పండుగ అంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడం చేతకాక... పప్పు, బెల్లాలపై కూడా పన్నులు వేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కేజీ ఉల్లి, క్యారెట్ ధర రూ. 120 దాటిందని... పచ్చిమిర్చి రూ. 130, క్యాబేజీ రూ. 80 వరకు ఉందని అనిత చెప్పారు. పప్పులు, నూనెల ధర తలచుకుంటేనే గుండె దడ పుడుతుందని అన్నారు. ధరలు ఆకాశాన్నంటుతుంటే పండుగ ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు.
పెరుగుతున్న ధరలపై ముఖ్యమంతి కనీసం సమీక్ష కూడా నిర్వహించడం లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం పండుగ చేసుకునే పరిస్థితి లేదని, ఉద్యోగులు డీఏ అడిగితే ప్రభుత్వం డీఏ క్యాలెండర్ ప్రకటించిందని ఎద్దేవా చేశారు. పీఆర్సీ విషయంలో కూడా జగన్ మాట మార్చారని... నెలరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఇంత వరకు పట్టించుకోలేదని మండిపడ్డారు.