Imran Khan: ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ఇమ్రాన్ ఖాన్ మండిపాటు!
- ఫ్రాన్స్ లో ఒక ఉపాధ్యాయుడిని హత్య చేసిన ఇస్లామిక్ అతివాదులు
- ఇలాంటివి ఇకపై కూడా జరుగుతాయన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
- ముస్లింలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్న ఇమ్రాన్
ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమాన్యుయెల్ మక్రాన్ పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ముస్లింలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్రాన్ వ్యాఖ్యలు ఇస్లాం వ్యతిరేకతను పెంచేలా ఉన్నాయని అన్నారు.
వివరాల్లోకి వెళ్తే చేతిలో ఫ్రాన్స్ కు చెందిన శామ్యూల్ పాటీ అనే ఉపాధ్యాయుడిని ఇస్లామిక్ అతివాదులు చంపేశారు. విద్యార్థులకు మహ్మద్ ప్రవక్తకు సంబంధించిన కార్టూన్లను చూపిస్తున్నాడనే కారణంతో హత్య చేశారు. ఈ హత్య ఫ్రాన్స్ ను కుదిపేసింది. గత బుధవారం శామ్యూల్ సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మక్రాన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు ఇకపై కూడా కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. ఫ్రాన్స్ భవిష్యత్తుపై ఇస్లామిక్ అతివాదులు కన్నేశారని... అందువల్లే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో కూడా జరుగుతాయని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇమ్రాన్ స్పందిస్తూ... మక్రాన్ పై మండిపడ్డారు.