Justice Ramana: జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలుకు అనుమతి ఇవ్వండి: లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ
- అటార్నీ జనరల్ వేణుగోపాల్ కు లేఖ
- కోర్టులను, జడ్జిలను బెదిరించేలా జగన్ వ్యవహరిస్తున్నారన్న అశ్విని
- జగన్ ప్రవర్తన కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వ్యాఖ్య
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సీజేఐకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం మీడియా ముఖంగా వెల్లడించిన తర్వాత కలకలం రేగింది. తాజాగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు సుప్రీంకోర్టు లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ లేఖ రాశారు.
సీజేఐకి జగన్ రాసిన లేఖను బయట పెట్టడం ముమ్మాటికీ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. 31 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోర్టులను, జడ్జిలను బెదిరించేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని గతంలో ఆయన పిటిషన్ వేశారు.