Bhim Army: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై కాల్పులు.. నిర్ధారించని పోలీసులు
- తన కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయంటూ ఆజాద్ ట్వీట్
- బులంద్‌షహర్‌లో ఓటమి భయంతోనేనన్న ఆజాద్
- తమ ర్యాలీని చూసి ప్రత్యర్థులు వణుకుతున్నారన్న భీమ్ ఆర్మీ చీఫ్
భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు కాల్పులకు దిగారు. బులంద్‌షహర్‌లో తన కాన్వాయ్‌పై కాల్పులు జరిగినట్టు ఆజాద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. వచ్చే నెల 3న జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు చెప్పారు.
బులంద్‌షహర్‌లో తమ పార్టీ అభ్యర్థిని చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారని, నేటి ర్యాలీ వారిని మరింత వణికిస్తోందని అన్నారు. అందుకే పిరికిపందల్లా కాన్వాయ్‌పై కాల్పులు జరిపారని ఆరోపించారు. ఇది వాళ్లలోని నిరాశా నిస్పృహలకు అద్దం పడుతోందన్నారు. అయితే, ఇక్కడి వాతావరణం చెడగొట్టాలన్న వారి ఆశలు నెరవేరబోవన్నారు. బులంద్‌షహర్ నుంచి ఆజాద్ సమాజ్ పార్టీ తరపున హాజీ యామిన్ బరిలో ఉన్నారు. కాగా, ఆజాద్ కాన్వాయ్‌పై కాల్పులను జిల్లా సీనియర్ ఎస్పీ సంతోష్ కుమార్ ఇప్పటివరకు ధ్రువీకరించలేదు.