Pakistan: బజ్వా.. నువ్వు సమాధానం చెప్పాల్సిందే: ఆర్మీ చీఫ్‌పై నవాజ్ షరీఫ్ ఫైర్
- ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఇమ్రాన్‌ను పదవిలో కూర్చోబెట్టారు
- ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ రాజకీయాల్లో తలదూర్చుతున్నారు
- ప్రజలను పేదరికంలోకి, ఆకలిలోకి నెట్టేశారు
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మండిపడ్డారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న నవాజ్ అక్కడి నుంచి పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) మూడో ర్యాలీలో వీడియో లింక్ ద్వారా ప్రసంగిస్తూ బజ్వాపై నిప్పులు చెరిగారు.
పాకిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితికి ఆయనే కారణమని ఆరోపించిన నవాజ్ ఇందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో జరిగిన రిగ్గింగుపై సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అలాగే, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడం, ప్రజలను పేదరికం, ఆకలిలోకి నెట్టేయడంపై సమాధానం చెప్పాల్సిందేనన్నారు.
సైన్యాన్ని అవమానించాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రమూ లేదన్న షరీఫ్.. అందుకనే బజ్వా పేరును ప్రస్తావించినట్టు చెప్పారు. ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ 'లెఫ్టినెంట్ జనరల్' ఫియాజ్ హమీద్ రాజకీయాల్లో తలదూరుస్తున్నారని మండిపడ్డారు. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 11 ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే గుజ్రాన్‌వాలా, కరాచీలలో ర్యాలీలు నిర్వహించగా, ఇది మూడోది.