Mumbai: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో తన కుమారుడి ప్రమేయం లేదన్న ఉద్ధవ్ థాకరే!
- నా కుమారుడు సహా ముంబై పుత్రులపై అసత్య ఆరోపణలు
- మా ముంబై పోలీసులు మాకు గర్వకారణం
- పీవోకేను భారత్‌కు తీసుకొస్తామని చెప్పి ఆరేళ్లయింది
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో తన కుమారుడు ఆదిత్య థాకరేపై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కొట్టిపడేశారు. ఈ కేసులో తన కుమారుడు సహా మహారాష్ట్ర పుత్రులెవరికీ సంబంధం లేదన్నారు. ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నటి కంగన రనౌత్‌ను ఉద్దేశించి నిన్న నిర్వహించిన శివసేన వార్షిక దసరా ర్యాలీలో సీఎం మాట్లాడారు.
ముంబై పోలీసులు, తన కుమారుడు ఆదిత్య థాకరే సహా ‘మహారాష్ట్ర పుత్రుల’పై నిందలు వేశారన్నారు. బీహార్ పుత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటున్నారని, అది నిజమే కావొచ్చని అయితే, అంతమాత్రాన మహారాష్ట్ర పుత్రులు సహా నా కుమారుడు ఆదిత్యపై నిందలు మోపడం సరికాదన్నారు. తాము పూర్తి స్వచ్ఛంగా ఉన్నట్టు సీఎం చెప్పుకొచ్చారు.
న్యాయం కోసం కన్నీరు కారుస్తున్నవారు ముంబై పోలీసులను పనికిరాని వారిగా చిత్రీకరిస్తున్నారని కంగనను ఉద్దేశించి అన్నారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా, ఇక్కడ అందరూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
‘‘మనం మన ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటాం. గంజాయిని కాదన్న విషయం వారికి తెలియదు. గంజాయిని మీ రాష్ట్రంలోనే పండిస్తారు. అదెక్కడో మీకు తెలుసు. కానీ, మా మహారాష్ట్రలో కాదు’’ అని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కంగనను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
మా ముంబై పోలీసులను చూసి తాము గర్విస్తామని, వారు ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నారని 26/11 నాటి ఉగ్ర ఘటనను గుర్తు చేశారు. ముంబైని పీవోకే అన్నారంటే అది ప్రధాని నరేంద్రమోదీకే అవమానమన్నారు. పీవోకేను స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఇప్పటికి ఆరేళ్లు అయినా అతీగతీ లేదని ప్రధానిని విమర్శించారు.