america: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు ముందే.. రికార్డు స్థాయిలో ఓటుహక్కు వినియోగం!
- కరోనా భయంతో ముందస్తు ఓటుకే పరిమితమవుతున్న అమెరికన్లు
- అమెరికా ఎన్నికల చరిత్రలోనే అత్యధిక బ్యాలెట్ ఓట్లు
- ముందస్తు ఓటింగులో ముందున్న టెక్సాస్
అమెరికాలో మరో వారం రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి బరిలో నిలవగా, ప్రత్యర్థిగా డెమోక్రాట్ల నుంచి జో బైడెన్ ఉన్నారు. అయితే, అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండడంతో ఈసారి పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయాలనుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది.
చాలా మంది బ్యాలెట్, ఈ-మెయిల్ ద్వారా ముందస్తుగానే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అమెరికాలో మొత్తం 17 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉండగా, ఈసారి ఇప్పటి వరకు రికార్డుస్థాయిలో 5.90 కోట్ల మంది తమ ఓటు హక్కును ముందస్తుగా ఉపయోగించుకోవడం విశేషం. అమెరికా ఎన్నికల చరిత్రలో ఈస్థాయిలో ముందస్తు ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. గత ఎన్నికల్లో ఇదే సమయానికి 5.70 కోట్ల మంది మాత్రమే ముందస్తుగా ఓటు వేశారు.
ముందస్తు ఓటింగులో టెక్సాస్ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముందుంది. అక్కడ ఈ శతాబ్దంలోనే అత్యధిక ముందస్తు ఓటింగ్ శాతం నమోదైంది. ఇక్కడ ఇప్పటికే 70 లక్షల మంది ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం ఓట్లలో ఇది 43 శాతం కావడం గమనార్హం. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 26 వేల మందికిపైగా ఓటు వేసినట్టు తెలుస్తోంది.
కాగా, 2016 ఎన్నికల కంటే కూడా ఈసారి అత్యధికంగా ముందస్తు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఫ్లోరిడా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న స్వతంత్ర అమెరికా ఎన్నికల ప్రాజెక్టు వెల్లడించింది. గత ఎన్నికల్లో 13.70 కోట్ల ముంది ముందస్తు ఓటు హక్కు వినియోగించుకోగా, ఈసారి 15 కోట్ల మంది ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.