USA: అమెరికాలో 60 లక్షల గ్లోవ్స్ చోరీ!
- అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
- వాటి విలువ ఒక మిలియన్ డాలర్లు
- గ్లోవ్స్ కంటెయినర్ నుంచి మరో ట్రక్కు ద్వారా చోరీ
దొంగలు నగలు, నగదును చోరీ చేయడానికి సంబంధించిన వార్తలను ప్రతిరోజు చదువుతూనే ఉంటాం. అయితే, అప్పుడప్పుడు మార్కెట్‌లో డిమాండ్ దేనికి ఎక్కువ ఉందో ఆ వస్తువులను కూడా దొంగలు చోరీ చేస్తున్నారు. ఉల్లి ధరలు పెరిగిన సమయాల్లో వాటిని చోరీ చేసిన ఘటనలకు సంబంధించిన వార్తలను వింటూనే ఉంటాం.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు, గ్లోవ్స్‌కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఫ్లోరిడాలో దొంగలు ఏకంగా 60 లక్షల గ్లోవ్స్ ను చోరీ చేశారు. వాటి విలువ దాదాపు ఒక మిలియన్ డాలర్లు ఉంటుంది.కోరల్ స్ప్రింగ్స్‌లోని మెడ్‌గ్లవ్ కంపెనీ ఆఫీసుకు గ్లోవ్స్ కంటెయినర్ చేరుకోగా అక్కడి నుంచి దొంగలు నిమిషాల వ్యవధిలో ఓ ట్రక్కులో వాటిని నింపుకొని వెళ్లారు.
ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. గ్లోవ్స్ కోసం అనేక ఆసుపత్రులు ఆర్డర్లు ఇచ్చాయని, ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో తాము వాటిని తయారు చేస్తున్నామని ఆ కంపెనీ సిబ్బంది తెలిపారు.