Bandi Sanjay: అధికారం ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి ఆ పని ఎందుకు చేయలేదు?: రేవంత్ రెడ్డి
- కేసీఆర్ కు బీజేపీలో అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నాయి
- బండి సంజయ్ ను విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు ఎందుకు పరామర్శించలేదు
- బండి సంజయ్ కు సెక్యూరిటీ ఎందుకు కల్పించలేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీలో అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను పిలిపించి, ఏం జరిగిందో సమీక్షించే అధికారం ఉన్నప్పటికీ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు ఆ పని చేయలేదని అన్నారు. కేంద్ర మంత్రి అయినప్పటికీ విచారణకు ఎందుకు ఆదేశించలేదని అడిగారు. టీఆర్ఎస్ తో కిషన్ రెడ్డికి ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏమిటని ప్రశ్నించారు.
బండి సంజయ్ ను మొదటి సారి కొట్టినప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోలేదని... అందుకే ఇప్పుడు ఆయనను చంపేందుకు యత్నించారని రేవంత్ అన్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఇచ్చిన సెక్యూరిటీని... సొంత ఎంపీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రఘునందన్ రావు బంధువుల ఇంట్లో డబ్బులు ఉంటే ఐటీ అధికారులు సోదాలు చేయాలని... అంతేకానీ పోలీసులు పోదాలు చేయడమేంటని ప్రశ్నించారు.