Narendra Modi: రాజకీయ సంస్కృతిలో కుంభకోణాలు అంతర్భాగంగా మారాయి: మోదీ ఆవేదన
- అక్రమార్కులను శిక్షించకుంటే భవిష్యత్ తరాలు రెచ్చిపోతాయి
- అవినీతి ప్రభావం తొలుత పడేది పేదలపైనే
- దర్యాప్తులో జాప్యం భవిష్యత్ కుంభకోణాలకు పునాది రాయిగా మారుతుంది
- దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యం
దేశంలో కుంభకోణాలు వారసత్వంగా మారిపోయాయని, కొన్ని రాష్ట్రాల రాజకీయ సంస్కృతిలో అవి అంతర్భాగంగా మారిపోయాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ప్రారంభమైన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్’ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న అవినీతి దేశానికి పెను సవాల్ విసురుతోందన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించకుంటే వచ్చే తరం మరింత రెచ్చిపోతుందన్నారు.
అవినీతికి పాల్పడే వారికి చిన్న శిక్షలతో సరిపెట్టకూడదని అన్నారు. అవినీతి కేసుల దర్యాప్తులో జాప్యం సరికాదన్న ప్రధాని.. జాప్యం భవిష్యత్తు కుంభకోణాలకు పునాది రాయిలా మారుతుందన్నారు. మన ముందున్న వ్యక్తి తప్పుడు మార్గంలో వేల కోట్ల రూపాయలు సంపాదించాడని తెలిసినా అది సర్వసాధారణ విషయంగా మారిపోతుందని అన్నారు. దేశాభివృద్ధికి అది ఆటంకంగా మారుతుందన్నారు.
తాను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నల్లధనం వెలికితీతకు కమిటీని ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. తాము అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ పరిపాలన, బ్యాంకింగ్, ప్రణాళిక, వైద్యం, విద్య, కార్మిక, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే తమ ముందున్న లక్ష్యమని మోదీ వివరించారు.
అవినీతి ప్రభావం తొలుత పడేది పేదలపైనేనన్న మోదీ.. అది మొత్తం వ్యవస్థకు ఓ పెద్ద శత్రువని అన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడడం మనందరి బాధ్యతని పిలుపునిచ్చారు. లంచగొండితనం నిర్మూలనకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఇప్పటి వరకు 1500 చట్టాలను రద్దు చేసి నిబంధనలను సరళతరం చేసినట్టు చెప్పారు. ఉన్నత పదవుల్లో నియామకాల కోసం ఒత్తిళ్లు, సిఫార్సులకు చెక్ పెట్టినట్టు చెప్పారు.