nagababu: నాకు ఆస్తమా ఉంది.. దాంతో కరోనా సోకడంతో ఆందోళన చెందాను: నాగబాబు
- ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరాను
- కొన్నిసార్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డాను
- మూడో రోజు వాసన గుర్తించలేకపోయా
- ఇంటికి వచ్చే సమయానికి నా భార్యకు కరోనా వచ్చింది
సినీ నటుడు నాగబాబుకి ఆమధ్య కరోనా సోకగా, చికిత్స తీసుకుని కోలుకున్న విషయం తెలిసిందే. కరోనా సోకడం, చికిత్స తీసుకున్న అనుభవాలను ఆయన వివరించారు. కరోనాపై విజయం సాధించిన యోధుడినని తన గురించి తాను చెప్పుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. తాను అంటువ్యాధి నుంచి కోలుకున్న ఓ రోగిని మాత్రమేనని అన్నారు.
తనకు ఆస్తమా ఉందని, దీంతో కరోనా సోకడంతో ఆందోళన చెందానని అన్నారు. కరోనా నిర్థారణ అయిన వెంటనే చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరానని చెప్పారు. కొన్నిసార్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డానని, మూడో రోజు వాసన గుర్తించలేకపోయానని అన్నారు. ఔషధాలను వాడిన అనంతరం కొన్నిరోజులకు కరోనా లక్షణాలు తగ్గాయని చెప్పారు.
దీంతో వైద్యులు తనను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారని తెలిపారు. ఆసుపత్రి నుంచి తాను ఇంటికి వచ్చే సమయానికి తన భార్య పద్మజకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, దీంతో తామిద్దరం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు.
తన భార్య తనకంటే ఆరోగ్యవంతురాలని, అందుకే వెంటనే కోలుకోగలిగిందని తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. కరోనాతో మన శరీరం పోరాటం చేయగలదేమో కానీ, మన పక్కనే ఉండే కొంతమంది చేయలేకపోవచ్చని అన్నారు.