Devineni Uma: గతంలో వైసీపీ ప్రదర్శించిన ఈ వైఖరే పోలవరానికి పెను శాపంగా మారింది: దేవినేని ఉమ
- ప్రతిపక్షంలో ఉండగా పోలవరంపై తప్పుడు విమర్శలు
- అసత్య ఆరోపణలు, పునరావాసానికి అవినీతి కలర్
- కేంద్రానికి నిత్యం ఫిర్యాదుల మీద ఫిర్యాదులు
- విచారణ కోసం పట్టు.. నేడు వెంటాడుతున్న గతం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతోందని టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ చేసిన ఫిర్యాదులే ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు శాపంగా మారాయని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కమీషన్ల కోసం చంద్రబాబు నాయుడు కక్కుర్తి పడుతున్నారని, అందుకే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548 కోట్లకు పెంచారని, దీనిపై విచారణ జరపాలని విపక్ష నేత హోదాలో అప్పట్లో వైఎస్ జగన్ పంపిన ఫిర్యాదు లేఖలతో పాటు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రసంగ పత్రాల వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కథనాన్ని దేవినేని పోస్ట్ చేశారు.
‘ప్రతిపక్షంలో ఉండగా పోలవరంపై తప్పుడు విమర్శలు, అసత్య ఆరోపణలు. పరిహారం, పునరావాసానికి అవినీతి కలర్. కేంద్రానికి నిత్యం ఫిర్యాదుల మీద ఫిర్యాదులు, విచారణ కోసం పట్టు. నేడు వెంటాడుతున్న గతం. గతంలో వైసీపీ వైఖరే పోలవరానికి పెను శాపంగా మారిందంటున్న రైతులకు ఏం సమాధానం చెప్తారు? వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ నిలదీశారు.