heart: కరోనా వైరస్‌తో గుండెకు ముప్పు.. గుర్తించిన శాస్త్రవేత్తలు
- అమెరికాలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రి శాస్త్రవేత్తల పరిశోధన
- గుండెలోని సున్నితమైన భాగాలకు గాయాలు
- అవయవాల పనితీరుపై ప్రభావం
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి పరిశోధనలు చేస్తోన్న శాస్త్రవేత్తలకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కరోనా వైరస్ మనిషి శరీరంలోని అనేక అవయవాలపై దాడి చేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. గుండెపై కరోనా ప్రభావంపై అధ్యయనం చేసిన అమెరికాలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రి శాస్త్రవేత్తలు.. రోగుల గుండెపై ఆ వైరస్ దాడి చేస్తోందని, అందులోని సున్నితమైన భాగాలకు గాయాలు చేస్తోందని తాజాగా గుర్తించారు.
ఆ అవయవాల పనితీరుకు వైరస్ భంగం కలిగిస్తోందని తేల్చారు. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని, గుండెపోటు సంభవించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 305 మంది రోగుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. ఇందులో పాల్గొన్న 190 మంది కరోనా రోగుల గుండెపై కరోనా ఇన్ఫెక్షన్ ప్రభావం పడినట్లు చెప్పారు. వారి గుండెలోని కుడి జఠరిక గది పనితీరుపై ఇది ప్రభావం చూపిందని, అలాగే ఎడమ జఠరికలోని గోడ భాగం కదలికలు గతి తప్పాయని తెలిపారు.