KCR: ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లకు తావుండదు: సీఎం కేసీఆర్
- ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్
- ప్రజల ఆస్తులు, భూములకు రక్షణ ఉంటుంది
- క్రయ, విక్రయాలు 15 నిమిషాల్లో పూర్తవుతాయి
రాష్ట్రంలో ఈరోజు నుంచి అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ రోజు ఆయన ధరణి పోర్టల్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, ధరణి పోర్టల్ దేశానికే మార్గనిర్దేశంగా నిలుస్తుందని చెప్పారు. ఈ పోర్టల్ వల్ల అందరి ఆస్తులు, భూములకు రక్షణ ఉంటుందని తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్లకు తావుండదని చెప్పారు. ధరణి పోర్టల్ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉంటాయని... వీటి ఆధారంగా ఎవరికి వారే రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేసుకోవచ్చని తెలిపారు.
ఈ పోర్టల్ రూపకల్పన కోసం దాదాపు 200 సమావేశాలను నిర్వహించామని... అధికారులు దాదాపు మూడేళ్లు కష్టపడ్డారని కేసీఆర్ చెప్పారు. ఈ పోర్టల్ వల్ల క్రయ, విక్రయాలన్నీ నమోదు చేసిన 15 నిమిషాల్లో పూర్తవుతాయని అన్నారు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, పైరవీలు చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచలేదని, పాత చార్జీలే అమల్లో ఉంటాయని తెలిపారు. గొప్పగొప్ప సంస్కరణలను తీసుకొచ్చినప్పుడు ఇబ్బందులు రావడం సహజమని... వాటిని ఎదుర్కొని నిలబడ్డప్పుడే అభివృద్ధి సాధించగలుగుతామని చెప్పారు.
తాను ఉన్నంత వరకు రైతుబంధు పథకం ఆగదని రైతులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని చెప్పారు. త్వరలోనే వీఆర్వోల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.