Urmila Gajapathi: మా పట్ల సంచయిత అవమానకర రీతిలో ప్రవర్తించారు!: ఊర్మిళ గజపతి
- మరోసారి రచ్చకెక్కిన గజపతిరాజు కుటుంబీకుల వ్యవహారం
- సిరిమానోత్సవం సందర్భంగా సంచయిత అవమానించారన్న ఊర్మిళ
- వేడుకలకు హాజరవడం ఎప్పట్నించో ఆనవాయితీ అని స్పష్టీకరణ
మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ట్రస్టు వ్యవహారాలకు సంబంధించి ఆనంద గజపతిరాజు కుటుంబీకుల మధ్య వివాదాలున్న సంగతి తెలిసిందే. తాజాగా, విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమను సంచయిత అవమానించిందని ఆనంద గజపతిరాజు మరో కుమార్తె ఊర్మిళ గజపతిరాజు ఆరోపించారు.
ఊర్మిళ ఇవాళ తమ బంగ్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచయితపై విమర్శలు చేశారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం తమకు ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది కూడా తన తల్లి సుధా గజపతిరాజుతో కలిసి సిరిమాను ఉత్సవానికి వచ్చానని తెలిపారు.
అమ్మవారి వేడుకలు చూసేందుకు వచ్చిన తమ పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కోటలోకి ప్రవేశించగానే... తమ రాకను గమనించిన సంచయిత సిబ్బందిపై మండిపడి, వీళ్లను కోటలోకి ఎవరు రానిచ్చారు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందని ఊర్మిళ వెల్లడించారు. దాంతో కోటపై ముందు వరుసలో ఉన్న తమను వెనక్కి వెళ్లాలని ఈవో వచ్చి చెప్పారని ఆమె వివరించారు. అయితే, ఆ ఈవోను అడిగి కొంతసేపు అక్కడే కూర్చుని ఆపై దర్శనం చేసుకుని వచ్చేశామని తెలిపారు.
ఈ తరహా అనుభవం ఎదురవుతుందని తమకు తెలుసని, సంచయిత అహంకారంతో ప్రవర్తిస్తోందని ఆరోపించారు. మాన్సాస్ బోర్డు సభ్యురాలిగా తన తల్లిని ఇంతవరకు ప్రమాణస్వీకారం చెయ్యనివ్వలేదని ఊర్మిళ వెల్లడించారు. మాన్సాస్ ట్రస్టును తన సొంత సంస్థలా భావించి అధికారం చెలాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. సంచయిత చేష్టలు ఆనంద గజపతిరాజుకు అవమానకరమని పేర్కొన్నారు. కోట బురుజుపై నుంచి సిరిమాను ఉత్సవం తిలకించే హక్కు ఆనంద గజపతి వారసులుగా తమకుందని ఊర్మిళ స్పష్టం చేశారు.
కాగా, ఊర్మిళ, సుధా గజపతిరాజులను అక్కడ్నించి పంపించేందుకు పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేసిన నేపథ్యంలో... సంచయిత కోట బురుజుపై మరో వైపున కుర్చీ వేసుకుని వేడుకలు తిలకించారు. కోటకు మరోవైపున కూర్చుని ఊర్మిళ, ఆమె తల్లి సుధా సిరిమానోత్సవాన్ని వీక్షించారు.