Bonda Uma: క్రిమినల్, రెవెన్యూ చట్టంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఉందా?: బోండా ఉమ
- అమరావతిని చంపడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోంది
- బయటవారితో ఉద్యమాలు చేయిస్తున్నారు
- విశాఖలో 72 వేల రిజిస్ట్రేషన్లు చేశారు
అమరావతిని చంపడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. అమరావతిని కొనసాగించాలని కోరుతున్న రైతులు, మహిళలు, ప్రతిపక్ష పార్టీల నేతలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని అన్నారు.
అమరావతి ప్రాంత గ్రామాలకు చెందని వారిని బయట నుంచి తీసుకొచ్చి... రాజధానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. దీన్ని ప్రశ్నించిన రైతుల చేతులకు ఉగ్రవాదులకు వేసినట్టు బేడీలు వేసి జైల్లో పెట్టారని అన్నారు. ఇలాంటి ఘటనలను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతోందని చెప్పారు.
స్టాక్ మార్కెట్లు, సెబీలో ఉండే ఇన్సైడర్ ట్రేడింగ్ ను అమరావతిలో చూపిస్తున్నారని బోండా ఉమ దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ చట్టం, రెవెన్యూ చట్టంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఉందా? అని ప్రశ్నించారు. విశాఖలో 72 వేల రిజిస్ట్రేషన్లను చేశారని... వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. అమరావతిలో భూములు కొనకూడదని ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న న్యాయస్థానాలపై కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.