Jagan: 2 వేల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చికిత్స... అవసరమైతే కొత్త చికిత్సలకూ చోటు: సీఎం జగన్
- వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు పనులపై సమీక్ష
- నవంబరు 13 నుంచి అన్నిజిల్లాల్లో ఆరోగ్యశ్రీ
- రిఫరల్ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు
ఏపీ సీఎం జగన్ వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యశ్రీ పథకంపైనా చర్చించారు. ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్స అందిస్తారని, అవసరమనుకుంటే కొత్త చికిత్సలు కూడా జాబితాలో చేర్చుతారని సీఎం జగన్ వివరించారు. నవంబరు 13 నుంచి అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం 7 జిల్లాల్లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ, ఇకపై మిగిలిన 6 జిల్లాల్లోనూ అమలు కానుందని తెలిపారు.
ఆరోగ్యశ్రీ రిఫరల్ విధానం సజావుగా ఉండాలని, వైఎస్సార్ క్లినిక్కులు వచ్చేంతవరకు గ్రామ, వార్డు సచివాలయాలు ఆరోగ్యశ్రీ రిఫరల్ పాయింట్లుగా ఉంటాయని వివరించారు. సచివాలయాల్లో ఉండే హెల్త్ అసిస్టెంట్ లేక ఏఎన్ఎం ద్వారా రిఫరల్ చేయించాలని, ఆరోగ్యశ్రీ సదుపాయం లభించే ఆసుపత్రుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని సూచించారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం ముఖ్యమని, అందులో ఎలాంటి రాజీ వద్దని స్పష్టం చేశారు.