Botsa Satyanarayana: మోదీని ఒప్పించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు: బొత్స సత్యనారాయణ
- కాసుల కక్కుర్తి కోసం పోలవరంను చంద్రబాబు తాకట్టు పెట్టారు
- అవసరమైతే పోలవరంను కేంద్రానికి అప్పగిస్తాం
- చంద్రబాబు దోపిడీ వల్ల పోలవరం నిధులు తగ్గాయి
కాసుల కక్కుర్తితో ప్రత్యేక హోదాను టీడీపీ నేతలు తాకట్టు పెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కట్టాల్సిన అవసరం లేదని... తామే నిర్మిస్తామని చెప్పి, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టును తీసుకున్నారని అన్నారు. అయితే ప్రధాని మోదీని ఒప్పించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అవసరమైతే పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు కూడా సిద్ధమేనని అన్నారు.
చంద్రబాబు దోపిడీ వల్లే పోలవరం నిధులు తగ్గాయని... ప్రస్తుత దుస్థితికి ఆయనే కారణమని బొత్స విమర్శించారు. కమిషన్ల కోసం ప్రాజెక్టును తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో 3 లక్షల ఇళ్లకు పునాది వేశారని... 2.06 లక్షల ఇళ్లకు బేస్ మెంట్ వేశారని చెప్పారు. 81,048 ఇళ్ల నిర్మాణం 95 శాతం పూర్తయిందని చెప్పారు. ఇళ్లను ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ధర్నా అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.