Samajwadi Party: రైల్వే ఆసుపత్రి మరుగుదొడ్లకు ఎరుపు, ఆకుపచ్చ రంగులు.. సమాజ్‌వాదీ పార్టీ ఆగ్రహం
- లలిత్ నారాయణ్ ఆసుపత్రి టాయిలెట్లకు ఎస్పీ రంగులు
- పార్టీ అభ్యంతరంతో దిగొచ్చిన ఈశాన్య రైల్వే
- సాయంత్రానికే టైల్స్‌పై తెల్ల రంగు
గోరఖ్‌పూర్ జిల్లాలోని లలిత్ నారాయణ్ రైల్వే ఆసుపత్రి మరుగుదొడ్లకు ఎరుపు, ఆకుపచ్చ రంగులు వేయడంపై సమాజ్‌వాదీ పార్టీ మండిపడింది. తమ పార్టీ రంగులను మరుగుదొడ్లకు వాడడం దారుణమని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేసింది. నిన్న రైల్వే అధికారులను కలిసిన పార్టీ నేతలు వెంటనే రంగులను మార్చాలని కోరారు. తమ పార్టీ రంగులను టాయిలెట్లకు వేయడం అధికార పార్టీ కలుషిత మనస్తత్వానికి నిదర్శనమని సమాజ్‌వాదీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజకీయ దురుద్దేశంతోనే ఈ పనిచేశారని విమర్శించింది. రాష్ట్రానికి చెందిన ప్రధాన పార్టీ రంగులను మరుగుదొడ్లకు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రంగులు మార్చడమే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. నాలుగు నెలల క్రితమే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ రెండు రోజుల క్రితమే రంగుల విషయం తమ దృష్టికి వచ్చిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్ నాగిన సాహిని పేర్కొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ ట్వీట్‌పై ఈశాన్య రైల్వే స్పందించింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా రైల్వే ఆసుపత్రిలో వేసిన టైల్స్ సంవత్సరాల నాటివని, మరుగుదొడ్లను మరింత పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతోనే వాటిని వేసినట్టు పేర్కొంది. ఈ విషయంలో ఏ పార్టీకి సంబంధం లేదని, స్వచ్ఛ భారత్ మిషన్‌లో తమతో కలిసి రావాలని కోరింది.
అయితే, మళ్లీ ఏమైందో కానీ సాయంత్రానికే రంగులు మార్చారు. ఎరుపు, ఆకుపచ్చ టైల్స్‌పై తెలుపు రంగు వేసినట్టు రైల్వేకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టాయిలెట్ల గోడలపై ఎస్పీ కార్యకర్తలు నల్లరంగు పూయడంతో తాము తెలుపు రంగు వేయాల్సి వచ్చిందన్నారు. కాగా, తమ పార్టీ కార్యకర్తలు నల్లరంగు వేశారన్న ఆరోపణలను ఎస్పీ గోరఖ్‌పూర్ మహానగర్ చీఫ్ ఖండించారు.